అగ్నిహోత్రం | Telugu story

 

 

తెలుగు కథ అగ్నిహోత్రం వేద పండితుని వేదన


 

తటవర్తి భద్రిరాజు

 

 

"అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్..."
 

నాలుగు గంటల చలిని చీల్చుకుంటూ ఆ అగ్రహారంలో అప్పుడే జీవం తొణికిసలాడుతోంది. వీధి దీపాలు ఇంకా బద్ధకంగా వెలుగుతున్నా, ఆ పాత పెంకుటింట్లో మాత్రం ఉత్సాహం ఉరకలేస్తోంది. వంటింట్లో ఇత్తడి బిందెల చప్పుడు, తులసికోట ముందు ముగ్గుల సవ్వడి... ఈ శబ్దాలన్నింటినీ తనలో కలుపుకుంటూ, హాల్లో నుంచి వినిపిస్తున్న గంభీరమైన వేదఘోష ఆ ఇంటిని 'భూలోక వైకుంఠం'లా మార్చేస్తోంది.

నిజానికి అది షణ్ముఖ శర్మ దినచర్య అనడం కంటే, ఆయన జీవన లయ అనడం సబబు. ఆ పాత గోడల రంగులు వెలసిపోయి ఉండొచ్చు గాక... కానీ ఆ గాలిలో పరచుకున్న ఆధ్యాత్మిక పరిమళం మాత్రం, తెల్లవారుజామున విచ్చుకున్న పారిజాతంలా ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది.

 షణ్ముఖ శర్మ ఊపిరి పోసుకున్నది, ఎదిగింది అంతా ఆ మంత్రోచ్ఛారణల మధ్యే. అతని బాల్యం, ఈ తరం పిల్లల్లా సిమెంట్ రోడ్ల మీద కాన్వెంట్ బస్సుల కోసం పరుగులెత్తలేదు.

ఉదయాన్నే హడావిడిగా యూనిఫామ్ వేసుకుని, లేత భుజాలు కృంగిపోయేలా పుస్తకాల సంచిని మోసే 'బరువు' అతని జీవితంలో లేదు. అతని ప్రపంచం వేరు.

 తండ్రి శంకరశర్మ గారి గంభీరమైన కంఠం నుండి జాలువారే తైత్తిరీయ ఉపనిషత్తు, ఆకలిని మరిపించేలా అమ్మ ఆప్యాయంగా వడ్డించే వేడి వేడి ప్రసాదం, సాయంసంధ్య వేళ గుడిలో లయబద్ధంగా వినిపించే గంటల నాదం... ఇవే అతని ప్రపంచం.


ఆ గడప దాటితే ఉండే పరుగుపందెం గురించి అతనికి తెలియదు.
 

 

శంకరశర్మ గారి సిద్ధాంతం చాలా స్పష్టం. అది ఆయన రక్తంలోనే కాదు, ప్రతి ఆలోచనలోనూ ప్రవహించే ఒక ప్రవాహం.

'ఒరేయ్ షణ్ముఖా... వృత్తి వేరు, ధర్మం వేరు కాదు! మన బ్రాహ్మణ్యానికి వేదమే ప్రాణవాయువు. దాన్ని విడిచిపెట్టి నువ్వు సిరిసంపదల్లో తులతూగినా... అది కేవలం ‘బతుకు’ అవుతుందే తప్ప, సార్థకమైన ‘జీవితం’ కానే కాదు.'

తండ్రి కంఠంలోని ఆ గాంభీర్యం, ఆ మాటల్లోని సత్యం... షణ్ముఖుడి లేత మనసుపై చెరగని శిలాశాసనంలా నాటుకుపోయాయి.

వీధిలో ఈడు పిల్లలంతా చేతిలో క్రికెట్ బ్యాట్లతో కేరింతలు కొడుతుంటే... షణ్ముఖుడు మాత్రం పట్టు పంచె కట్టుకుని,  విభూతి రేఖలతో, చేతిలో పవిత్ర దర్భలు ధరించి గురుకులంలో ఒక చిన్న తపస్విలా నిశ్చలంగా కూర్చునేవాడు. 

బయట వినిపించే ఆ అరుపులు, కేరింతలు ఆ గురుకులపు ప్రశాంతతను, అతని ఏకాగ్రతను ఏనాడూ తాకలేకపోయాయి.

లేత వయసు కదా... ఆ కఠినమైన నియమాలు అప్పట్లో కాళ్లకి వేసిన సంకెళ్ళలా, గుండెపై మోయలేని బరువులా అనిపించేవి. 

స్నేహితులంతా 'వీకెండ్' మత్తులో స్వేచ్ఛగా తేలుతుంటే... షణ్ముఖుడు మాత్రం ఆకాశంలో సూర్యుడి వైపు చూస్తూ, సంధ్యావందనం వేళ దాటిపోతుందేమోనని గుండెలో రాయి పడినట్లు కంగారు పడేవాడు. వాళ్ళకేమో ఆదివారం ఆనందం, ఇతనికేమో అనుష్టాన భయం!


 వయసు పెరిగింది, దాంతో పాటే జ్ఞానమూ విచ్చుకుంది. 

ఆ శ్లోకాల్లోని నిగూఢార్థం తెలిసాక... ఇన్నాళ్లు తాను మోసింది బరువును కాదు, ఒక గొప్ప వారసత్వాన్ని అని తెలుసుకున్నాడు.

వేదం ఒక చదువు మాత్రమే కాదు, అది బతుకును జీవితంగా మార్చే ఒక దిక్సూచి అని షణ్ముఖుడికి అనుభవంలోకి వచ్చింది.

కాలచక్రం గిర్రున తిరగడమే కాదు, షణ్ముఖుడి జీవితాన్ని ఒక ఉన్నత శిఖరంపై నిలబెట్టింది. ఇప్పుడాయన కేవలం శంకరశర్మ గారి అబ్బాయి కాదు... సాక్షాత్తూ 'ఘనపాఠీ'. చుట్టుపక్కల పది జిల్లాల్లో ఒక నానుడి స్థిరపడిపోయింది - 'షణ్ముఖ శర్మ గారు పీట మీద కూర్చుంటే చాలు, ఆ యాగానికి ప్రత్యక్ష దైవం దిగివచ్చినట్టే, ఆ క్రతువుకి నిండుదనం వచ్చినట్టే' అని!

 అతని కంఠంలోని గాంభీర్యం, మంత్రోచ్ఛారణలోని స్పష్టత, క్రతువు నిర్వహణలోని నిష్ఠ... ఇవే అతనికి ఆ ప్రాంతంలో తిరుగులేని కీర్తిని, ఒక బ్రాండ్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి.

ఇక సంపాదన విషయానికి వస్తే... సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లా 'అంకెల ప్యాకేజీలు' లేకపోవచ్చు. ఒకటో తారీఖున 'శాలరీ క్రెడిటెడ్' అనే మెసేజ్ ఫోన్‌లో రాకపోవచ్చు. కానీ, వేదాన్ని నమ్ముకున్న వాడిని ఆ వేదమాత ఏనాడూ పస్తులు ఉంచదన్న తండ్రి మాట అక్షర సత్యమైంది. లక్ష్మీకటాక్షానికి, బతుకులో భరోసాకి... ఏరోజూ లోటు రాలేదు.

దక్షిణగా వచ్చే డబ్బు, సంభావనలు, అన్నింటికంటే మించి పదిమంది ఇస్తున్న గౌరవం... ఇవి అతనికి తృప్తినిచ్చాయి.

 తండ్రి శంకరశర్మ కళ్ళలో ఆనందం చూసినప్పుడల్లా, "నేను గెలిచాను, నా ధర్మాన్ని నిలబెట్టాను" అన్న గర్వం షణ్ముఖుడిలో ఉండేది.

కానీ, జీవితం అంటే కేవలం వృత్తి మాత్రమే కాదు కదా! గృహస్థాశ్రమం అనే మరో ముఖ్యమైన ఘట్టం దగ్గర షణ్ముఖుడి జీవితం ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.

 అదే 'పెళ్లి'.  మొదట్లో, "ఇంకా టైమ్ ఉందిలే, మన వాడికి పిల్లనివ్వడానికి ఎవరైనా ఎగబడతారు" అని శంకరశర్మ గారు ధీమాగా ఉండేవారు.

కానీ వయసు ఇరవై ఎనిమిది దాటి ముప్పైకి చేరువవుతున్న కొద్దీ, ఆ ధీమా స్థానంలో ఆందోళన వచ్చి చేరింది.

సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. బంధువుల్లో, తెలిసిన వాళ్లలో, మ్యాట్రిమోనీ సైట్లలో... ఇలా అన్ని దారులూ వెతికారు.

కులం సరిపోయింది. గోత్రం కలిసింది. జాతక చక్రాలు అద్భుతంగా ఉన్నాయి. కానీ సంబంధం ఖాయం అనుకునే సమయానికి అవతలి వైపు నుండి ఒకే ఒక్క ప్రశ్న బాణంలా దూసుకొచ్చేది.

"అబ్బాయి ఏం చేస్తాడు?"

"వేద పండితుడు. ఘనపాఠీ. సొంతంగా పౌరోహిత్యం చేస్తారు," అని చెప్పేవాడు మధ్యవర్తి. 

ఆ మాట వినగానే అవతలి వారి గొంతులోని ఉత్సాహం నీరుగారిపోయేది.

"ఓహో... పూజలు చేస్తారా? అంటే ప్రైవేట్ జాబ్ లాంటిదే కదా? ఐటి ఉద్యోగం కాదా? పోనీ ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్ గా అయినా చేస్తే బావుండేది. "

ఈ మాటలు విన్న ప్రతిసారీ షణ్ముఖుడి గుండెలో ఏదో తెలియని బాధ ముల్లులా గుచ్చుకునేది.

తన విద్యని, తన పదేళ్ల కఠోర శ్రమని, తన జీవన విధానాన్ని సమాజం కేవలం ఒక 'అస్థిరమైన ఉపాధి'గా మాత్రమే చూస్తోందా? వేదానికి, కంప్యూటర్ కోడింగ్ కి మధ్య ఉన్న పోటీలో తాను ఓడిపోతున్నానా? అనిపించేది.

ఒక ఆదివారం అమలాపురం నుండి ఒక పెళ్లి సంబంధం వచ్చింది.

అమ్మాయి ఎంబీఏ చదివింది. ఒక మల్టీనేషనల్ కంపెనీలో హెచ్.ఆర్. అబ్బాయి వివరాలు  తెలుసుకోవడానికి  మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు.

అమ్మాయి తండ్రి చాలా ప్రాక్టికల్ మనిషి. ఆయన మాటల్లో డొంకతిరుగుడు లేదు.

"చూడండి శర్మ గారు... మీ అబ్బాయి బంగారం. అందులో సందేహం లేదు.

సంప్రదాయాన్ని నిలబెడుతున్నందుకు సంతోషం. కానీ... మనం వాస్తవంలో బ్రతకాలి కదా? రేపు పిల్లలు పుడతారు. వాళ్ళ స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు, ఈ ఎం ఐ లు... ఇవన్నీ పూజల ద్వారా వచ్చే దక్షిణతో మేనేజ్ చేయగలరా? సాఫ్ట్ వేర్ లో అయితే ఇన్సూరెన్స్ ఉంటుంది, పి.ఎఫ్ ఉంటుంది. 

మీ వృత్తిలో ఏముంది గ్యారెంటీ?" అని అంటూ ఉంటే శంకర శర్మ గారి కి ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు.

ఆ గదిలో నిశ్శబ్దం ఆవహించింది. గోడ మీద ఉన్న దేవుడి ఫోటో వైపు షణ్ముఖుడు చూశాడు. ఆ దేవుడికి సేవ చేయడమే తన వృత్తి. కానీ ఆ వృత్తికి 'గ్యారెంటీ' లేదని సమాజం తీర్పునిచ్చింది.

షణ్ముఖుడు మౌనంగా ఉండిపోయాడు. కానీ అతని అంతరాత్మ ఘోషించింది. "సార్... మీరు సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు. ఐటీలో రెసిషన్ వస్తే రాత్రికి రాత్రే ఉద్యోగం పోతుంది. కానీ నా విద్య నా కంఠంలో ఉంది. సమాజం ఉన్నంత కాలం, మనిషికి నమ్మకం ఉన్నంత కాలం నా వృత్తికి ఢోకా లేదు.

నేను కార్పొరేట్ ఆసుపత్రిలో ఇన్సూరెన్స్ ఇవ్వలేకపోవచ్చు, కానీ మీ ఇంటికి ఆయురారోగ్యాలు ప్రసాదించే యజ్ఞాన్ని చేయగలను. అది మీకు విలువగా కనిపించడం లేదా?" అని చెప్పాలి అనుకున్నాడు.

కానీ ఈ మాటలు పెదవి దాటలేదు.

 ఎందుకంటే సమాజం తన కళ్ళకు 'ఆర్థిక భద్రత' అనే కళ్ళ జోడు పెట్టుకుంది. ఆ జోడులోంచి చూస్తే వేద పండితుడు కేవలం ఒక నిరుద్యోగిలానో, లేదా అల్ప ఆదాయ వర్గంగానో కనిపిస్తున్నాడు.


ఆ సంబంధం కూడా తప్పిపోయింది.
 

ఆ రాత్రి తండ్రి శంకరశర్మ అన్నం తినలేదు. వరండాలో కూర్చుని శూన్యంలోకి చూస్తున్నారు. షణ్ముఖుడు తండ్రి దగ్గరికి వెళ్లి, "నాన్నా, భోజనం చేద్దురు రండి" అని పిలిచాడు.

శంకరశర్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కొడుకు చేతిని గట్టిగా పట్టుకుని, వణుకుతున్న స్వరంతో అన్నారు. "షణ్ముఖా... నేను తప్పు చేశానా రా? నా స్వార్థం కోసం, మన సంప్రదాయం పోకూడదన్న తాపత్రయంతో నిన్ను ఈ చదువు చదివించాను.

అందరిలా నిన్ను కూడా బీటెక్ చదివించి ఉంటే, ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా? పదిమందిలో తలవంచుకునే పరిస్థితి తెచ్చానా నాయనా?" అంటూ ఉంటే...

ఆ మాటలు షణ్ముఖుడిని కుదిపేసాయి. ఏ తండ్రి అయితే వేదాన్ని పరబ్రహ్మ స్వరూపంగా నమ్మాడో, ఆ తండ్రే ఈ రోజు తన నిర్ణయాన్ని శంకించుకుంటున్నాడు. ఇది ఒక వ్యక్తి ఓటమి కాదు, ఒక సంస్కృతి ఓటమి.

"నాన్నా! ఏం మాట్లాడుతున్నారు? మీరు నాకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా, తరగని విద్యని ఇచ్చారు. ఒక అమ్మాయి తిరస్కరించిందని, లేదా నలుగురు తక్కువ చేశారని నేను నా వృత్తిని తక్కువ చేసుకోను.

 ఎవరో గుర్తించలేదని సూర్యుడు ఉదయించడం మానేస్తాడా? వేదం నా ఊపిరి నాన్నా. దాన్ని వదిలే ప్రసక్తే లేదు," అని ధైర్యం చెప్పాడు.

కానీ ఆ ధైర్యం వెనుక ఒక సన్నని ఆవేదన దాగి ఉంది.

రోజులు గడుస్తున్నాయి. సమాజం మారుతోంది. ఒకప్పుడు అగ్రహారంలో వేద పండితుడికి ఉన్న గౌరవం ఇప్పుడు లేదు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళ హడావిడి ఎక్కువైంది.

 మంత్రాలు చదివే పంతులు గారు కేవలం ఒక 'ప్రొసీజర్' పూర్తి చేసే వ్యక్తిగా మిగిలిపోయారు. ఫోటోగ్రాఫర్ కి ఇచ్చే సమయం కూడా పంతులు గారికి ఇవ్వని రోజులివి.

 "పంతులు గారూ... త్వరగా కానిచ్చెయ్యండి, డిన్నర్ కి టైమ్ అవుతోంది" అనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

షణ్ముఖుడికి ఇప్పుడు అర్థమైంది. సమస్య తనలో లేదు. సమస్య తను ఎంచుకున్న వృత్తిలోనూ లేదు. సమస్య ఈ సమాజం మార్చుకున్న ప్రాధాన్యతలలో ఉంది.

భౌతిక సుఖాలకు, కంటికి కనిపించే ఆడంబరాలకు ఇస్తున్న విలువ, కంటికి కనిపించని ఆత్మసంతృప్తికి, సంస్కృతికి ఇవ్వడం లేదు.

మొన్న ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాదు, డిగ్రీ చదివి ఇంటి పట్టునే ఉంటోంది. కనీసం వీళ్ళైనా  అర్థం చేసుకుంటారని ఆశపడ్డాడు. కానీ ఆ అమ్మాయి తండ్రి అడిగిన ప్రశ్న ఇంకా క్రూరంగా ఉంది.

"బాగానే ఉందండి. కానీ రేపు మీ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళను కూడా బడికి పంపకుండా వేద పాఠశాలకు పంపిస్తారా? మా అమ్మాయికి మోడ్రన్ లైఫ్ అంటే ఇష్టం. సినిమాలు, షికార్లు, వెకేషన్లు... ఇవన్నీ మీ లైఫ్ స్టైల్ లో ఉంటాయా?"

ఆ క్షణం షణ్ముఖుడికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు.

 

వేదం చదివిన వాడు సినిమాలు చూడకూడదా? షికార్లకు వెళ్లకూడదా? పట్టుపంచె కట్టినంత మాత్రాన మనసు శిల అయిపోతుందా? ఆధునికత అంటే కేవలం జీన్స్ ప్యాంట్ వేసుకోవడమేనా? ఆలోచనల్లో ఆధునికత ఉండక్కర్లేదా?

వేదం నేర్పేది సంకుచితత్వం కాదు. "ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః" (విశ్వం నలుమూలల నుండి మంచి ఆలోచనలు మనకు రావాలి) అని కోరుకునే విశాల దృక్పథం అది. కానీ సమాజం మాత్రం పండితుడంటే చాదస్తం మనిషి అని, మోడ్రన్ సుఖాలకు పనికిరాడని ముద్ర వేసేసింది.

చివరికి షణ్ముఖుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. తన కోసం తన మూలాలను మార్చుకోకూడదు. తనని అర్థం చేసుకునే వ్యక్తి ఎక్కడో ఒకచోట ఉండే ఉంటుంది. లేదా, ఒంటరిగానైనా సరే ఈ ప్రయాణాన్ని కొనసాగించాలి.

ఇప్పుడు షణ్ముఖ శర్మ వయసు ముప్పై రెండు. ఇంకా పెళ్లి కాలేదు. కానీ అతని ముఖంలో నైరాశ్యం లేదు. ఒక స్థితప్రజ్ఞత ఉంది. రోజూ ఉదయం స్నానం చేసి, తడి బట్టలతో సూర్యుడికి అర్ఘ్యం వదులుతున్నప్పుడు అతనిలో ఒక తేజస్సు కనిపిస్తుంది. ఆ తేజస్సు, ఏ సాఫ్ట్ వేర్ కంపెనీ ఐడీ కార్డులోనూ కనిపించదు.


అతను ఒంటరిగా మిగిలిపోవచ్చు. కానీ అతను ఓడిపోలేదు.

 

కానీ ఇక్కడ ఓడిపోతున్నది ఎవరు?

 ఖచ్చితంగా మనమే. మన సమాజమే.

 ఎందుకంటే, మన సంస్కృతికి మూలస్తంభాలైన వారిని, మన ధర్మాన్ని కాపాడే వారిని మనం గౌరవించలేకపోతున్నాం.

 వారిని మనలో కలుపుకోలేకపోతున్నాం. "సాఫ్ట్ వేర్ అయితే చాలు, మిగతాది ఏమున్నా లేకపోయినా పర్లేదు" అనే గుడ్డి నమ్మకంతో, ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని, ఒక గొప్ప సంప్రదాయాన్ని దూరం చేసుకుంటున్నాం.

 

 రేపు పొద్దున... మన పిల్లల పెళ్లిళ్లకు మంత్రాలు చదవడానికి ఎవరూ రాకపోతే?

 

మన తలరాతలు మార్చమని గుడిలో అర్చన చేయించడానికి అర్చకుడు దొరక్కపోతే?

 అప్పుడు మనం ఎవరిని నిందిస్తాం?

 షణ్ముఖ శర్మ కథ కేవలం ఒక వ్యక్తి పెళ్లి కష్టాల కథ కాదు.

 ఇది మన విలువల పతనావస్థకు అద్దం పట్టే కథ.

 అగ్నిహోత్రం ఆరిపోకముందే మనం మేల్కొనాలి. లేదంటే, మిగిలేది బూడిద మాత్రమే కాదు... భవిష్యత్తు లేని ఒక యాంత్రిక సమాజం.

 వేదమంటే కేవలం మంత్రం కాదు... అది మన అస్తిత్వం.

 మరి ఆ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్న షణ్ముఖుడికి మనం ఇస్తున్న విలువేంటి?

 ఈ ప్రశ్న ఈ సమాజం గుండెను తట్టాలి.

 

 ఈ కథ కానీ మీకు నచ్చితే మీ మనసుకు నచ్చిన వారికి షేర్ చేయండి .

 


 

ఇవి కూడా చదవండి

 

నాన్న కోసం


Post a Comment

Previous Post Next Post