❖✍ తటవర్తి భద్రిరాజు
కిటికీ అద్దాల మీద వర్షపు చినుకులు తాళం వేస్తున్నాయి. ఆ చినుకుల చప్పుడు శరణ్యకు తన బాల్యాన్ని గుర్తుచేస్తోంది. శరణ్యకు తన తండ్రి అంటే ఎంతో ఇష్టం.
ఆయన ఆఫీసులో ఫైళ్లు మోసే ఒక చిన్న అటెండర్ కావొచ్చు, కానీ తన దృష్టిలో మాత్రం ఆయన ప్రపంచాన్ని గెలిచిన చక్రవర్తి.
ఆఫీసులో ఆయన అందరికీ తల వంచి నమస్కారం చేయవచ్చు.. కానీ తనని మాత్రం రాకుమారిలా చూసుకునే ఆ మనసు ముందు ఏ చక్రవర్తి అయినా చిన్నబోవాల్సిందే.
"అమ్మీ! నా చేతులు ఫైళ్లు మోశాయి,
నీ చేతులు ఆ ఫైళ్లపై సంతకాలు చేయాలి.
నువ్వు గొప్ప అధికారివి అవ్వాలి తల్లి" అని ఆయన తన గరుకైన చేతులతో శరణ్య తల నిమురుతుంటే, ప్రపంచంలోని ధైర్యమంతా తనలోనే ఉన్నట్లు అనిపించేది శరణ్యకు.
సెలవు వచ్చిందంటే చాలు.. నాన్న పాత సైకిల్ మీద కూర్చోబెట్టుకుని చెరువు గట్టుకు తీసుకెళ్లేవారు.
తన జేబులో ఉన్న ఆ ఒక్క రూపాయి బిళ్ళను తీసి నా చేతిలో పెట్టి 'ఐస్ ఫ్రూట్' కొనిపించేవారు.
ఆ రూపాయి ఐస్ ముక్కలో నాన్న పంచిన తీపి.. ఇప్పుడు ఏ పండగ రోజు చేసుకునే పిండివంటల్లో కూడా వెతుక్కున్నా దొరకడం లేదు. విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు. కరోనా ఆయనను తీసుకెళ్లిపోయింది.
నాన్న చనిపోయాక శరణ్య ప్రపంచం ఒక్కసారిగా చీకటిమయమైంది. నాన్న పని చేసే ఆఫీస్ లోనే చిన్న జాబ్ లో జాయిన్ అయ్యింది.
శరణ్య కళ్లలో నీళ్లు ఆరకముందే, తల్లికి చుట్టూ ఉన్న లోకం భయం పట్టుకుంది. "శరణ్యా.. నాన్న లేని ఇంట్లో ఆడపిల్ల ఒక్కర్తే ఉండకూడదు తల్లి. నీకో తోడు కావాలి, నీ మెడలో ఒక తాళి పడితేనే నాకు మనశ్శాంతి" అని కన్నతల్లి కన్నీళ్లు పెట్టుకుంది.
నిజానికి శరణ్యకు అప్పుడే పెళ్లి ఇష్టం లేదు.. పెద్ద ఉద్యోగం చేసి నాన్న కల నిజం చేయాలనుకుంది.
కానీ బంధువులంతా చుట్టుముట్టారు. "తండ్రి లేని పిల్ల.. రేపు ఏమైనా తేడా వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు ? త్వరగా పెళ్లి చేసి పంపించడమే ధర్మం" అని అందరూ కలిసి ఆమె కలల్ని పక్కన పెట్టి, పెళ్లికి బలవంతం చేశారు.
శరణ్య కూడా తనలో తాను సర్దిచెప్పుకుంది. "నాన్న పోయిన తర్వాత నా మనసు నిండా ఒకటే వెలితి.. ఆ ప్రేమను, ఆ ఆదరణను భర్త రూపంలో పొందవచ్చేమో! నాన్న లాగే తను కూడా నన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు. నాన్న లేని లోటును తను భర్తీ చేస్తాడు" అని ఎన్నో తీపి కలలు కన్నది.
తన పెళ్లి కోసం తాపత్రయ పడుతున్న అమ్మ మనసును నొప్పించడం ఇష్టం లేక, శేఖర్ సబంధాన్ని ఒప్పుకుంది. శేఖర్ తన జీవితాన్ని నందనవనం చేస్తాడని నమ్మి, ఆశగా ఆ కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది.
శరణ్య కన్న కలలన్నీ పెళ్లయిన పది రోజులకే కళ్లముందే కాలి బూడిదయ్యాయి. తండ్రి ప్రేమను భర్తలో వెతుక్కుందామనుకున్న ఆ చిన్నదానికి.. శేఖర్ రూపంలో ఒక మృగం పరిచయమైంది. శేఖర్ పెద్దగా చదువుకోలేదు.. అదే అతడిలోని అహంకారానికి, అసూయకు కారణమైంది.
శరణ్య డిగ్రీ చదివిందని, తను అందంగా, తెలివిగా మాట్లాడుతుందని లోపల కుళ్ళిపోయేవాడు. ఆ అసూయే అనుమానంగా మారింది.
"ఏం చదువుకున్నావని గర్వమా? ఆఫీసుకి వెళ్లేది పని చేయడానికా.. లేక ఆ మేనేజర్ గాడితో నవ్వుతూ మాట్లాడడానికా? వాడు నిన్ను గదిలోకి పిలిచినప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకున్నావా?" అంటూ నోటికొచ్చినట్టు పచ్చిగా మాట్లాడుతుంటే, శరణ్య నిలువునా నీరైపోయేది.
నాన్న నీడలో రాకుమారిలా పెరిగిన ఆ బిడ్డకు.. ఈ మాటలు ఒక్కోటి వెయ్యి తేళ్లు కుట్టినట్టు అనిపించేవి.
కేవలం మాటలతోనే ఆగలేదు.. తాగొచ్చి జుట్టు పట్టుకుని ఈడ్చి, గోడకేసి కొడుతుంటే శరణ్యకు తన నాన్న జ్ఞాపకం వచ్చేది. 'నాన్న బతికి ఉంటే నన్ను ఇలాంటి నరకంలో పడవేసేవారా?' అని కుమిలిపోయేది.
ఆఫీసు మాన్పించేశాడు, బయట ప్రపంచంతో సంబంధాలు తెంచేశాడు. ఒకప్పుడు నాన్న గొడుగు నీడలో స్వేచ్ఛగా గడిపిన ఆ పక్షి.. ఇప్పుడు శేఖర్ అనే బంధీఖానాలో రెక్కలు విరిగి విలవిలలాడుతోంది. అడిగేవారు లేరు, ఆదుకునే వారు లేరు.. గడప దాటనివ్వని ఆ అనుమానపు గోడల మధ్య శరణ్య బతుకు ఒక మూగ రోదనగా మిగిలిపోయింది.
ఓ రాత్రి శేఖర్ తాగిన మైకంలో కాదు, ఒక పిశాచిలా ఇంటికి వచ్చాడు.
శరణ్య చేతిలో ఉన్న ఫోన్‌ను ఒక్క ఉదుటన లాక్కుని, నేలకేసి కొట్టాడు.
"ఎవడితో మాట్లాడుతున్నావే? నీ చదువు సంధ్యలు అన్నీ ఈ ఫోన్లోనే ఉన్నాయా?" అంటూ ఆమె జుట్టును తన గరుకైన చేతులతో చుట్టేసి, ఈడ్చుకుంటూ వెళ్లి గది మూలకు విసిరేశాడు.
ఆ దెబ్బకు శరణ్య నుదురు పగిలి రక్తం ధారగా కారుతున్నా, అతని కళ్లలో కనికరం లేదు.
మరుసటి రోజే ఆమె ఆఫీసుకి వెళ్లకుండా అడ్డుపడి, ఆ ఉద్యోగాన్ని బలవంతంగా మాన్పించేశాడు.
తట్టుకోలేక, ఒంటి మీద వాతలతో, కళ్ల నిండా కన్నీళ్లతో శరణ్య కన్నతల్లి దగ్గరకు పరుగున వెళ్లి కాళ్ల మీద పడింది. "అమ్మా.. నాన్న ఉంటే నన్ను ఈ నరకంలో చూసి ఊరుకునేవారా? వాడు మనిషి కాదు రాక్షసుడు అమ్మా.. నన్ను ఇక్కడే ఉంచుకో, కూలి పని చేసైనా నిన్ను సాకుతాను కానీ ఆ నరకానికి మాత్రం పంపకు" అని వెక్కి వెక్కి ఏడ్చింది.
కానీ ఆ తల్లి గుండె కరగలేదు.. లోకం ఏమనుకుంటుందో అన్న భయంతో గడ్డకట్టుకుపోయింది. శరణ్య చేతులు పట్టుకుని ఓదార్చాల్సింది పోయి, ఆమెనే నిలదీసింది. "ఆడపిల్ల అన్నాక పుట్టింటికి తిరిగి రాకూడదు తల్లి. మొగుడు అన్నాక నాలుగు దెబ్బలు వేయడా? అత్తవారింట్లో చావునైనా, బతుకునైనా గడప దాటకూడదు.
ఇక్కడే ఉంటే ఊరంతా ఉమ్మేస్తారు. పో.. వెళ్లి అతని కాళ్లు పట్టుకో, గొడవలు తగ్గించుకుని సర్దుకుపో" అని నిర్దాక్షిణ్యంగా చెప్పి, తలుపులు మూసేసింది.
తనను కన్న పేగు కూడా లోకానికి భయపడి తనని అగాధంలోకి నెట్టేసిందని తెలిశాక, శరణ్యకు శేఖర్ కొట్టిన దెబ్బల కంటే తల్లి అన్న మాటలే ఎక్కువ నొప్పిని మిగిల్చాయి.
ఇక అడిగే దిక్కు లేదని, ఎవరు తనకు అడ్డు రారు అని శేఖర్.. ఆ రోజు నుండి తన క్రూరత్వాన్ని మరింత పెంచాడు. ఆ ఇంట్లో శరణ్య శ్వాస తీసుకోవాలన్నా అతని అనుమతి కావాలన్నట్టుగా ఆమె జీవితాన్ని బందీ చేశాడు.
కాలం ఎవరి కోసమూ ఆగదు.. పెళ్లయి ఏడాది తిరగకుండానే శరణ్య ఒడిలోకి ఒక ఆడపాప వచ్చింది. ఆ పసికందును చూడగానే శరణ్యకు తన నాన్న గుర్తొచ్చారు. 'నాన్నే మళ్ళీ పుట్టారు' అని మురిసిపోయింది.
కానీ శేఖర్ మాత్రం ఆ బిడ్డను చూసి ముఖం తిప్పుకున్నాడు. 'నా ఆస్తిని పంచుకోవడానికి పుట్టిందా ఇది ?' అంటూ పసిగుడ్డును మంచం మీదకు విసిరికొట్టాడు. కన్నబిడ్డ అని కూడా చూడకుండా అతను చేసిన పని శరణ్య గుండెను పిండేసింది.
ఒక రాత్రి శేఖర్ తీవ్రంగా కొట్టి, పసిపాపను కూడా గోడకేసి కొట్టినంత పని చేసినప్పుడు శరణ్య మనసు అంత ఆలోచనలతో నిండి పోయింది.
ఇక శేఖర్ తో జీవితాన్ని కొనసాగించలేను అని గట్టిగా అనుకుంది. ఇక్కడ నుండి తల్లి దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది కానీ తల్లి చెప్పే సర్దుకుపో అనే మాట గుర్తుకు వచ్చి తన ఆలోచనలు ను అక్కడే ఆపేసింది. పోనీ విడాకులు తీసుకుని ప్రశాంతం గా ఉండాలి అనుకుంది. కానీ సమాజం తనను ఎలా చూస్తుందో అన్న భయం తన ఆలోచనలు ను ముందుకు వెళ్లానివ్వలేదు.
శేఖర్ తల్లిదండ్రులు పల్లెటూర్లో ఉంటారు. వారు శేఖర్ ప్రవర్తనకు ఎప్పుడూ బాధపడుతుంటారని ఆమెకు తెలుసు.
శరణ్య ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. తెల్లవారుజామునే పాపను ఎత్తుకుని, నాన్న ఫోటోను గుండెకు హత్తుకుని నేరుగా అత్తమామల దగ్గరకు వెళ్ళింది.
అత్తగారు పార్వతమ్మ, మామగారు రాఘవయ్య ఆ రాత్రి శరణ్యను చూసి షాక్ అయ్యారు.
ఆమె ఒంటి మీద వాతలు, చిరిగిన బట్టలు, ఏడుస్తున్న పాపను చూసి పార్వతమ్మ పరుగున వచ్చి అక్కున చేర్చుకుంది.
శేఖర్ విషయం తెలిశాక రాఘవయ్య తల దించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
అప్పుడే శేఖర్ తాగి అక్కడికి వచ్చాడు. "చూశారా నాన్న! మీ కోడలు నా మాట వినకుండా ఇక్కడికి వచ్చింది, దీన్ని ఇప్పుడే చంపేస్తా" అని మీదికి వచ్చాడు.
రాఘవయ్య లేచి కొడుకు చెంప పగలగొట్టారు. "ఒరేయ్! ఇంతకాలం శరణ్య మౌనం గా భరిస్తుంటే నువ్వు మృగంలా మారావు. శరణ్య మా కోడలు కాదురా... మా కూతురు!" అని గర్జించారు.
పార్వతమ్మ శరణ్య దగ్గరకు వచ్చి, ఆమె చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. "శరణ్యా! తల్లీ... క్షమించు. వాడు మా కడుపున పుట్టినందుకు మేమే సిగ్గుపడుతున్నాం.
వాడు మా పెంపకంలో లోపం తో ఆలా తయారవ్వలేదు. వాడి రక్తంలోనే రాక్షసత్వం ఉంది.
వాడు మాకు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. కానీ నువ్వు మా ఇంట్లో ఉండాలి తల్లి.
ఈ ముసలి ప్రాణాలు ఉన్నంత వరకు నిన్ను, నా మనవరాలిని కంటికి రెప్పలా చూసుకుంటాం.
నువ్వు మళ్ళీ చదువుకో, మళ్ళీ ఉద్యోగం చెయ్. మీ నాన్న కన్న కలల్ని మేం నిజం చేస్తాం.
రాఘవయ్య శేఖర్ వైపు తిరిగి... "నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోరా. నీలాంటి వాడిని కన్నందుకు మేము సిగ్గు పదితున్నాం.
నా ఆస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వను. మొత్తం నా కూతురు శరణ్య పేరు మీద రాస్తాను. ఇక నువ్వు మాకు పరాయివాడివి!" అని తెగేసి చెప్పారు.
శేఖర్ మొహం తెల్లబారింది. అతను నమ్ముకున్న అహంకారం, తండ్రి బలమైన మాటల ముందు కూలిపోయింది.
శరణ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. తన కన్నతల్లి అండగా నిలవని చోట, అత్తమామలు దైవంలా నిలబడ్డారు.
నాన్న చనిపోయాక తను అనాథను అనుకుంది, కానీ ఈరోజు మరో ఇద్దరు తల్లిదండ్రులను పొందింది.
ఈరోజు శరణ్య ఒక స్వతంత్రురాలు. అత్తమామల మద్దతుతో ఉద్యోగంలో చేరింది. తన కూతురికి 'అమ్మలా పోరాడాలి' అని నేర్పిస్తోంది.
తల్లిదండ్రులు ఇచ్చే 'సర్దుకుపో' అనే సలహాల కంటే, అత్తమామలు ఇచ్చే 'మండలించడమే సంస్కారం' అనే మద్దతు ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎంత గొప్పగా మారుస్తుందో ఈ కథ చెప్తూ ఉంది.
శేఖర్ లాంటి వాళ్లకు సమాజం కంటే సొంత తల్లిదండ్రులే గుణపాఠం చెబితే, ఏ ఆడపిల్ల జీవితం బలికాదు. శేఖర్ తల్లిదండ్రుల నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి
మీరు ఇవి కూడా చదవండి

Post a Comment