ఊరు మారింది - రాజేష్ తటవర్తి

నా స్వగ్రామం కోనలోవ అంటే నాకెంతో ఇష్టం . ఉద్యోగం నిమిత్తం దేశంలో ఎన్నో ప్రాంతాలు తిరిగి చివరికి బెంగుళూరులో స్థిరపడ్డాను. ఎన్నో ఏళ్లుగా ఊరికి దూరంగా ఉన్నా.. పచ్చని పొలాలు, నిండు ఆకాశాన్నే తనలో ప్రతి బింబించే చక్కని చెరువు, వాన వెలిశాక, పనులు ముగిశాక, పొద్దు గడిచాక, రైతన్న స్వేదం తుడిచి సేద తీరుస్తున్నట్టుగా వచ్చే పైరగాలి, చెరువుకి చేలకి మధ్యలో స్వర్గానికే మార్గం అనిపించేలా మట్టి రోడ్డు... నా కళ్లలో కదలాడుతూ, జ్ఞాపకాలతో దోబూచులు ఆడుతూనే ఉంటాయి.

ఎన్నో రోజులుగా కోనలోవ వెళ్లాలి అని మనసులో ఉన్నా, పని వత్తిడితో సాధ్యం కాలేదు. చాలా కాలానికి కొన్ని రోజులు సెలవు పెట్టుకునే అవకాశం దొరికింది. సెలవులని ఎలాగైనా మా ఊళ్లోనే గడపాలని నిశ్చయించుకున్నా. వెంటనే తత్కాల్‌లో టెక్కెట్లు బుక్ చేశాను. నేను వస్తున్నట్లు కోనలోవలో ఉన్న బాబయ్యకి ఫోన్ చేశాను. 

పెళ్లిళ్ల సీజన్ కావడంతో ట్రైన్ రద్దీగానే ఉంది. ట్రైన్ వేగంగా కదులుతూ ఉంది. నెమ్మదిగా నా ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి.


చిన్నతనంలో మా ఇంటి వెనుక మామిడితోటలో రెండు కాయలు దొంగతనం చేశాను. ఆ తోటకు కాపలగా ఉండే వ్యక్తి నన్ను పట్టుకున్నాడు. పాము, పాము అని హడావిడి చేసి తప్పించుకున్నాను.


వేసవి వచ్చింది అంటే మా ఇల్లు అంతా పిల్లలతో సందడిగా ఉండేది. సరదా సరదాగా ఆటలతో గడిపేసేవాళ్లం. ఇంటి చుట్టూరా ఉండే తాటి చెట్లు నుండి ముంజికాయలు తెచ్చుకుని తినేవాళ్లం. ఆ తరువాత ఆ కాయలతో బళ్లు తయారుచేసి ఆడుకునేవాళ్లం. సైకిల్ టైర్లను దొర్లించుకుంటూ పందాలు పెట్టుకునే వాళ్లం. వానాకాలం వస్తే పుస్తకాలలో పేజీలు పడవల్లా మారేవి.

టి.సి వచ్చి టిక్కెట్ అనడంతో నా ఆలోచనలు నుండి బయటకి వచ్చాను. టిక్కెట్ చూసి టి.సి వెళ్ళిపోయాడు. ఆగిన నా ఆలోచనలు వెతుక్కుంటూ వెనక్కి వెళ్లాను. ఊరిలో ఉన్న పొలాలు, పాలేరుల కోతి చేష్టలు, పనివాళ్ల కూనిరాగాలు, కాలుష్యం లేని పరిసరాలు, కల్మషం లేని ప్రజలు ఇప్పటికీ నా కళ్ల ముందు కదులుతూనే ఉన్నాయి. 

పక్షుల కిలకిలరాగాలు, పశువుల అంబారావాలు మధ్య నా బాల్యం ఎంతో మధురంగా గడిచింది.


జ్ఞాపకాలు రైలు బండి కన్నా వేగంగా నాలో పరిగెడుతుండగానే, నేను దిగాల్సిన స్టేషన్ వచ్చింది. అప్పటికే స్టేషన్లో బాబాయ్ నా కోసం ఎదురుచూస్తున్నాడు. " రారా రఘు . రా " అంటూ కారు దగ్గరకి తీసుకుని వెళ్లాడు. ఊరిని చూస్తాను అనే ఆనందంలో ప్రయాణం అలసట ఏమాత్రం తెలియలేదు. 


కారులో కూర్చున్నాను అన్నమాటే కానీ ఊరిని ఎప్పుడు చూస్తానా అని నా మనసు ఆత్రంగా ఉంది. అంతలో ఆశ్చర్యం... అనుమానం.... ఇల్లు వచ్చేసింది. మరి ఊరేది? చుట్టూ చూశాను.

"ఏంట్రా అలా చూస్తున్నావ్. మర్చిపోయావా ఇదే మన ఇల్లు" అంటూ బాబాయ్ ముందుకు కదిలాడు. ఇంటి వెనకాల మామిడి తోట లేదు. రోడ్డు పక్కన చెట్లు లేవు. అసలు పరిసరాలే నా బాల్యాన్ని గుర్తుచేసేవిగా లేవు. చుట్టూ చూసుకుంటూ మౌనంగా లోపలకి నడిచాను. నేను ఏదీ మర్చిపోలేదు. 

ఆ గదిలో ఫ్యాన్ స్విచ్ కూడా నాకు గుర్తుంది. ఇల్లు ఏమీ మారలేదు. కానీ ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తెచ్చినట్టు, మా ఇంటిని కూడా ఎవరో తీసుకు వచ్చి మరోచోట పెట్టినట్టుగా ఉంది.

రోడ్డు పక్కన పొలాల స్థానంలో పరిశ్రమలు ఉన్నాయి. పశువుల పాకల స్థానంలో దుకాణాలు ఉన్నాయి. ఇంటి ముందర తోటలో మొక్కల ఆకులు దుమ్మూ ధూళితో అలంకరణ చేసుకున్నట్లు ఉన్నాయి. అందవికారంగా దర్శనం ఇస్తున్న ఆ మొక్కలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడే ముసలి ప్రాణంలా నేల వాలుతున్నాయి. సెంటు మల్లి మొక్క నుండి కూడా ఏదో దుర్వాసన. కమ్మని మట్టివాసన స్థానంలో ఏదో దుర్వాసన. నేను పనిచేసే లాబ్ లో 'హెచ్2ఎస్ ' వాయువు కన్నా దారుణంగా ఉంది ఈ వాసన.


"ఏంటి బాబాయ్ ఈ వాసన?" బాబాయ్ ని అడిగాను.


"అదా.. మన ఊరి చివర పరిశ్రమ ఒకటి పెట్టారు. అందులో ఎండుచేపలని, రొయ్యలని, ఏవో ఎరువులని అన్నీ కలిపి మర ఆడతారు. ఈ వాసన ధూళి పరిశ్రమ నుండే" బాబాయ్ చెప్పాడు. 


"ఇంత కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమకి ప్రభుత్వం అనుమతి ఎలా ఇచ్చింది!" అనుమానంతో అడిగాను. 


"కాసులకి కక్కుర్తిపడే అధికారులు కళ్లు మూసుకుని అనుమతులు ఇస్తారు. ఇక్కడ పంచాయతీ ఆఫీసులో ప్రసిడెంట్ ఉండదు. వి.ఆర్.వో ఊర్లోకి వచ్చినా ఊరు చివరకి రాడు. సంక్రాంతి కోడిపందాలకి తప్ప పోలీసులకి మన ఊర్లో పనిలేదు. ఐదు ఏళ్లకి ఒకసారి వచ్చే రాజకీయ నాయకులకి ఓట్ల యావ తప్ప, జనాల ఇబ్బంది గురించి ఆలోచన లేదు." అంటూ ఊరి పరిస్థితి విపులంగా వివరించాడు. 


"మరి కనీసం పట్టించుకునే ప్రజలు లేరా?" అని కొంచెం ఆవేశంగానే అడిగాను మళ్లీ.


"ఈ ఫ్యాక్టరీ కాలుష్యం గురించి అడగడానికి కొంత మంది సిద్ధపడ్డా రాజకీయ నాయకులు వెనక్కి లాగారు. అంత ఎందుకు? మన చెరువుకి అవతల ఏదో రసాయనాల ఫ్యాక్టరీ నిర్మించారు. 

దాని నుండి వచ్చే వ్యర్థ రసాయనాలు మన చెరువు లోకి వదులుతుంటే ప్రజలు ఆవేశంతో ఉగిపోయారు." 


"చెరువులోకి రసాయనాలా?" అశగా , ఆసక్తిగా అడిగాను. "ఏం చేశారు?" అని.


"ఏం చేస్తారు. మీటింగ్ పెట్టారు. కుర్రాళ్లకి ఉద్యోగాలు ఇవ్వండి. నీళ్లు కాలుష్యం కాకుండా చూడండి అని కోర్కెలు చెప్పి క్లోజ్ చేశారు. నవ్వుతూ చెప్పాడు బాబాయ్. 


"అంతేనా?" అడిగాను.


"అంతకన్నా ఏమి చేయగలరు? ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం గత సంవత్సరం లక్షల్లో విరాళాలు అందించి, మన ఊరి దసరా సంబరాలు అంబరాన్ని తాకేలా వైభవంగా జరిపించారు. ఆ విరాళాలు మన ఊరి వాళ్ల నోరు నొక్కేశాయి. తరువాత నేను ఏమైనా తక్కువ తిన్నానా అన్నట్టుగా మరో ఫాక్టరీ వాడు వినాయకచవితి వేడుకలకి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని హామీ ఇచ్చాడు."


పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పచ్చని పల్లెలని విషరసాయనాలతో కలుషితం చేయడం తలుచుకుంటేనే నా రక్తం మరిగిపోతోంది. కోట్లకు పడగలెత్తాలి అనే కోరికలు పెరిగి, భక్తి ముసుగు తొడిగి ఉన్న ఊరికి అన్యాయం చేస్తున్నారు. ఖర్చు పెట్టడానికి తప్ప మరెందుకూ పనిచేయని రూపాయిని ఎరగా చూపి పాపాలకు ఒడిగడుతున్నారు. 

పాపం పండిన వాళ్లతో పండగ జరిపించుకుంటూ దేవుడు మౌనంగా ఆరుకోగలడేమో!! నేను సహించలేకపోయాను. పక్క ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాను. ఎస్.ఐ నేను చెప్పినది అంతా విని.. "మీరు ఎక్కడ ఉంటారు?" అని అడిగాడు. సంబంధం లేని ప్రశ్న అనిపించింది. "బెంగుళూరు" కాస్త గట్టిగానే చెప్పాను. 

అతని నుండి నేను ఊహించని మాటలు విన్నాను . " "చూడండి సర్, మీరు సరదాగా గడుపుదాం అని ఇక్కడికి వచ్చారు. ఉన్న ఈ కొద్దిరోజుల్లో ఈ తగువులు తలకి ఎక్కించుకోవడం ఎందుకు చెప్పండి. రెండు రోజులు ఉండి వెళ్లిపోయే మీ కోసం అన్ని కోట్ల రూపాయల ఫాక్టరీని మూయించలేము కదా!" అని. నేను 'నా కోసం కాదు. ఊరి అందరి కోసం ఆలోచించి ఫిర్యాదు చేయడానికి వచ్చాను.' అని చెప్పాను. 


నన్ను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ "అయితే మీ ఊరి పెద్దల చేత సంతకాలు తీసుకుని రండి." అన్నాడు. 

వచ్చి జరిగింది బాబాయ్ కి చెప్పాను. "నాతో చెప్పకుండా ఎందుకు వెళ్లావ్?" అంటూ నా మీద అరిచాడు. 


"నాలుగు రోజులు ఉండి వెళ్లిపోయే నీకెందుకు ఈ గొడవలు?", 

మళ్ళీ అదే ప్రశ్న. నా గుండల్లో గునపంలా దిగింది . " "ఇది నా ఊరు" అని గట్టిగా అరవాలి అనిపించింది . కానీ నాకు ఆ అవకాశం ఇవ్వకుండానే అనేక సందేహాస్త్రాలు సంధించాడు బాబాయ్. 

" మన ఊరి అభివృద్ధి నీకు ఇష్టం ఉండదా?" అని. "అభివృద్ధి అంటే కాలుష్యాభివృద్ధా?" మరో ప్రశ్నను సమాధానంగా ఇచ్చాను. 

"అయినా నువ్వు కంప్లైంట్ చేసి వెళ్లిపోతావు. కానీ తరువాత మా పరిస్థితి ఏమిటి? వాళ్లు మమ్మల్ని సుఖంగా బ్రతకనిస్తారా?" 

ఈ ప్రశ్నలు వింటున్న నేను నా కళ్ల ముందు 6 అడుగుల స్వార్థాన్ని చూశాను. 

అజ్ఞానంతో మేధావులు అనుకునే వాళ్లని మార్చాలి అనుకోవడం మూర్ఖత్వం అనిపించింది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నా ఊరు అటు పట్నంలా మారలేక, ఇటు పల్లెలా ఉండలేక వికృతంగా మారింది. 

ఆ చేప పిల్ల త్వరగా స్వర్గం చేరాలని కోరుకున్నాను 


కారు అద్దంలో నుండి చూస్తూ ఉంటే కలుషితం అయిన చెరువులో చేపపిల్ల చెరువులో ఉండలేక, బయట పడలేక కొట్టుకుంటూ కనిపించింది. నరకం అనుభవిస్తున్న ఆ చేపపిల్ల త్వరగా స్వర్గం చేరాలని ఆశిస్తూ నిస్సహాయంగా తల దించాను.




(31/5/2012 ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ప్రచురించబడింది)

Post a Comment

కొత్తది పాతది